హైదరాబాద్: కేరళలో ‘కేరళ కథ’ రాజకీయ దుమారం రేపుతోంది. దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే సినిమా ప్రధాన ఉద్దేశమని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. సినిమా విడుదలపై వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. డీజీపీ నుంచి నివేదిక అందిన తర్వాతే కేరళలో సినిమాను విడుదల చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం విజయన్ స్పష్టం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌కు నాలుగు రోజుల ముందు మే 5న సినిమా విడుదల కావడం కూడా పినరయి వాదనకు బలం చేకూర్చింది. అదే సమయంలో ఈ సినిమా భవిష్యత్తులో మరింత వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విస్తరణలో భాగంగా యువతలో మత విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా బీజేపీ ఇలాంటి సినిమాలను (‘కాశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీస్’) ప్రచారం చేస్తోందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
