ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఏదో మార్పు జరుగుతుందని ప్రజలు విశ్వసించి కాంగ్రెస్‌కు పట్టంగట్టారని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. ‘కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు రేవంత్ ప్రవర్తిస్తున్నారు. ఆయన పోకడ చూసి ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఏ పథకాలు ఉంటాయో, ఏవి వస్తాయో తెలియడం లేదు. రేవంత్ పాలన ప్రజల పాలిట శాపంలా మారింది. కార్మికులకు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మారింది. తాజాగా తెచ్చిన జీవోలు కార్మికుల గొంతు కోసేలా ఉన్నాయి.
Read Also: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఐదోసారి నోటీసులు
కేసీఆర్ హయాంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను ఇప్పుడు తొలగిస్తున్నారు. 73 రకాల కార్మికుల ఎంప్లాయిమెంట్ షెడ్యూళ్లు రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటైంది. రెండో వేతన సలహా మండలి కూడా కేసీఆర్ హయాంలోనే ఏర్పాటైంది. 2021లో సలహా మండలి ప్రతిపాదించిన సూచనలు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జీవోలు తెచ్చింది. కేసీఆర్ హయాంలో కార్మికుల కనీస వేతనం 18 వేల 19 రూపాయలుగా నిర్ణయం అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నెల 29న విడుదల అయిన జీవోలో కనీస వేతనం 11 వేల 770 రూపాయలుగా నిర్ణయం అయ్యింది. దీంతో కార్మికులు నెలకు 6 వేల రూపాయలు నష్ట పోతున్నారు. పాత జీవోలు యథాతథంగా అమలు చేస్తే కార్మికులకు నష్టం జరగదు. వేతనాలు తక్కువ చేయడానికేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని కార్మిక లోకం ఆందోళనతో ఉంది. కొత్త జీవోలు అమలు చేస్తే కార్మికు లోకం తిరగబడటం ఖాయం’ అని చందర్ హెచ్చరించారు.
