గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్… ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే… రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వన్ని తిరస్కరించిందన్నారు. కానీ ఈరోజు వస్తున్న వార్తలు ప్రకారం ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాలమీద ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలన్నారు.
రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు:
రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు.. రాజభవన్ నడుస్తుందన్న విషయాన్ని గవర్నర్ గుర్తుంచుకోవాలన్నారు. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాధ్యులు కానీ రేవంత్ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యంకు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిజెపికి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా అనే విషయం స్పష్టం చేయాలన్నారు.
కాంగ్రెస్ , బీజేపీ కుమ్మక్కు:
ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బిజెపిలో కుమ్మక్కును తెలియజేస్తుందని..సర్పంచులు పదవీకాలం పొడిగించాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు కేటీఆర్. ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచ్ ల పదవీకాలం పొడిగించాలి.. కానీ ప్రత్యేక ఇన్చార్జిలను పెట్టవద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతితులు చేయాలి కానీ.. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇన్చార్జిలు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. రెండు సంవత్సరాల పాటు కరోనా సమయంలో వారి పరిపాలన సమయం పోయింది. కాబట్టి పదవి కాలాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరం మెరుకు పొడిగించాలి. లేదా తిరిగి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే వరకు వారి కాలాన్ని పొడిగించాలని డిమాండ్ చేశారు. కేవలం మంత్రులు అందుబాటులో లేరు, కొత్తగా ఎన్నికైన మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు అంటూ సర్పంచులు పూర్తిచేసిన కార్యక్రమాల ప్రారంభాన్ని కూడా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు కేటీఆర్.
