హైదరాబాద్: ఉద్యోగుల ప్రమాద బీమాను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెంచింది. ఈ మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఉన్న రూ.40 లక్షల ప్రమాద బీమా రూ. ఒక కోటికి పెరిగింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఒప్పందంపై సంతకాలు చేశారు.
Also Read.. రైతుల పొట్ట కొట్టే ప్రయత్నం చేయొద్దు
రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్(యూఎస్ఎస్ఏ) కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నారు. రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు సంస్థ అందించనుంది. ఫిబ్రవరి 1వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుందని ఆర్టీసీ వెల్లడించింది.
Also Read.. దారితప్పిన చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్!
యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున అందజేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు. గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి రూ.ఒక కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రూపే కార్డు ఉంటే మరో రూ.12 లక్షల బీమా అందుతుందని వివరించారు.
