విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో టీంఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెచ్చిపోయాడు. తన టెస్ట్ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. 277 బంతులు ఆడిన జైస్వాల్.. 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో ఈ రికార్డు అందుకున్నాడు. తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసిన టీంఇండియా.. రెండో రోజు 396 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
కాగా.. తొలిసారి డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్.. అతిచిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. జైస్వాల్ 22 ఏండ్ల 37 రోజులలో ఈ ఘనత సాధిస్తే.. ఆయన కంటే ముందు వినోద్ కాంబ్లి 21 ఏండ్ల 35 రోజులు, సునీల్ గవాస్కర్ 21 ఏండ్ల 283 రోజులలో ఈ రికార్డ్ సాధించారు. అంతేకాకుండా.. జైస్వాల్ భారత్ నుంచి డబుల్ సెంచరీ చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల జాబితాలోనూ స్థానం దక్కించుకున్నాడు. సౌరభ్ గంగూలీ, వినోద్ కాంబ్లి, గౌతమ్ గంభీర్ల తర్వాత జైస్వాల్ ఈ రికార్డ్ నెలకొల్పాడు. నిలిచాడు.
ఇదే కాకుండా.. జైస్వాల్ అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే డబుల్ సెంచరీ చేసిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు. జైస్వాల్ 10వ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేస్తే.. కరుణ్ నాయర్ 3వ ఇన్నింగ్స్‌లో, వినోద్ కాంబ్లి 4వ ఇన్నింగ్స్‌లో, గవాస్కర్, మయాంక్ అగర్వాల్ 8వ ఇన్నింగ్స్‌లో, పుజారా 9వ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేశారు. వీరిలో గవాస్కర్, మయాంక్ అగర్వాల్ తప్ప మిగతావారంతా ఇంగ్లాండ్‌పైనే చేయడం గమనార్హం.
