తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేవాలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశం నిషేధించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఆదేశించింది. దేవాలయాలంటే పిక్నిక్ స్పాట్ కాదంటూ మండిపడింది. ఆలయాల్లోని ‘కోడిమారం’ (ధ్వజస్తంభం) ప్రాంతం దాటి హిందూయేతరులను అనుమతించరాదని పేర్కొంటూ అన్ని హిందూ దేవాలయాల్లో బోర్డులు పెట్టాలని తమిళనాడు ప్రభుత్వ హిందూ మత, ధర్మాదాయ శాఖను మద్రాసు హైకోర్టు మంగళవారం ఆదేశించింది. హిందువులకు కూడా తమ మతాన్ని విశ్వసించే, అనుసరించే హక్కు ఉందని కోర్టు పేర్కొంది.
డి.సెంథిల్ కుమార్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు మధురై బెంచ్‌లోని జస్టిస్ ఎస్ శ్రీమతి ఈ నిర్ణయం తీసుకున్నారు. అరుల్మిగు పళని ధనదాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు దిశానిర్దేశం చేయాలని సెంథిల్ కుమార్ కోరారు. అన్ని ఆలయాల ప్రవేశాల వద్ద ఈ విషయమై బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. మురుగన్ ఆలయం దిండిగల్ జిల్లాలోని పళనిలో ఉంది.
ఇది కూడా చదవండి: యాదాద్రి నరసింహస్వామి హుండీ ఆదాయం..25 రోజుల్లో ఏకంగా రూ. 2.32 కోట్లు..!!
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. దేవాలయాల ప్రవేశద్వారం వద్ద, ధ్వజస్తంభం దగ్గర, ఆలయంలోని ప్రముఖ ప్రదేశాల్లో ‘హిందువులు కొడిమారం దాటి ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి లేదు’ అని బోర్డులు పెట్టాలని ప్రతివాదులను ఆదేశించింది. హిందువేతర వ్యక్తి ఆలయాన్ని సందర్శిస్తే, తనకు దేవతపై విశ్వాసం ఉందని, హిందూమతంలోని ఆచారాలు, ఆచార వ్యవహారాలను పాటిస్తానని, నియమ నిబంధనలకు లోబడి ఉంటానని అధికారులు అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. అలాంటి పనులు ఆలయ అధికారులు నిర్వహించే రిజిస్టర్‌లో నమోదు చేయబడతాయని జస్టిస్ ఎస్ శ్రీమతి తీర్పు చెప్పారు.
