ముఖ్యమంత్రి ,మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.ఇవాళ(సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారు. హామీల అమలును ప్రశ్నిస్తే వారికి అసహనం పెరుగుతోంది.మా మీద కోపం ఉంటే తీర్చుకోండి..రాష్ట్రాన్ని నష్టం పరిచే చర్యలు చేయకండి. కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకు తెలియదు.నిమిషానికో మాట మార్చేరకం. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటి రెడ్డి చెప్పిన దాన్నే కేటీఆర్ చెప్పారు.కేటీఆర్ నిజం చెబితే కోమటిరెడ్డి చిన్న పెద్దా లేకుండా మాట్లాడుతున్నారు. కోమటి రెడ్డిని కాంగ్రెస్ లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ అభ్యర్ధి తన తమ్ముడి కి ఓట్లేయమని చెప్పింది కోమటి రెడ్డి వెంకట రెడ్డి.
బీఆర్ఎస్ ను 39 ముక్కలు చేస్తా అంటున్నారు.కోమటి రెడ్డి తాత తరం కూడా కాదు బీఆర్ఎస్ ను అంతం చేయడం అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. కోమటి రెడ్డి లాంటి వాళ్ళెందరో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు..సాధ్యం కాలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి గురువు వల్ల కూడా ఆ పని కాలేదు అని అన్నారు. అధికారిక రివ్యూకి వెళ్లి కోమటి రెడ్డి అనవసర విషయాలు మాట్లాడారు..యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్ళీ వచ్చాయన్నారు. ముందు ఆ సమస్య పై దృష్టి పెట్టండి అని సూచించారు. రైతు బంధు ఇంకా రాక పోవడం పై.. అన్నదాతల్లో ఆందోళన ఉందన్నారు. అప్రకటిత కరెంటు కోతలు పెరిగిపోయాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
కృష్ణా జలాల్లో తెలంగాణ కు అన్యాయం జరుగుతోంది..కొట్లాడే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. మేమే కొట్లాడాము ..ఎవరి వల్ల కాలేదన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం కాదు..మీ బాసో.. నువ్వో.. మరో ఏక్ నాథ్ షిండే అవుతావు కోమటి రెడ్డి వెంకట రెడ్డి అని హెచ్చరించారు. పాలన కాంగ్రెస్కు ఇచ్చింది పార్టీ లను చీల్చడానికి కాదు..ప్రజలే కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతారన్నారు. కేసీఆర్ వల్లే సాగర్ లో నీళ్ల సమస్య వచ్చింది అంటున్నాడు కోమటి రెడ్డి. పాలన చేత కాకుంటే తప్పుకోండి అని సవాల్ చేశారు. నిరసనలకు మేము తొందర పడటం లేదు ..ప్రజలే సమస్యల పై రోడ్ల పైకి వస్తారు అని అన్నారు జగదీష్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో మేమే మెజారిటీ సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ముంబై మారథాన్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
