తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల వల్ల రోగులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని వెల్లడించారు. మండల కేంద్రంలోని పెర్డపల్లిలో రూ.5.25 లక్షలతో డయాగ్నస్టిక్ సెంటర్, రూ.కోటితో నిర్మించిన ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోగులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు వీలుగా సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. నర్సింగ్ కళాశాలలు, మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు, ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్లు, జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లలో ప్రజలకు ఉచిత సేవలు అందిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సబ్ సెంటర్లలో పరీక్షల నిమిత్తం పరీక్ష నమూనాలను జిల్లా కేంద్రానికి తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
