ప్రముఖ నటుడు విశాల్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాట టాక్ నడుస్తోంది. పార్టీ ఏర్పాటుకు విశాల్ సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా రాజకీయ ఎంట్రీ ఉండబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాల్ పొలిటికల్ ఎంట్రీపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఆయన తన పార్టీ పేరును కూడా ప్రకటించబోతున్నారని సమాచారం.
గతంలో చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ కూడా వేశారు. అయితే, కొన్ని కారణాల రీత్యా ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. గతంలో ఓ సారి విశాల్ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. అయితే నా రాజకీయ ప్రవేశం ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను. సమాజసేవ చేసేందుకే రాజకీయాల్లోకి అడుగు పెడతా’ అని విశాల్ స్పష్టం చేసారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా తెలుస్తోంది.
ఇప్పటికే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ‘తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు. అయితే తన పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అదేవిధంగా ఏ పార్టీకి మా పార్టీ మద్దతివ్వట్లేదని విజయ్ తెలిపాడు.
ఇది కూడా చదవండి: లివిన్ రిలేషన్‌షిప్ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందే.. లేదంటే జైలే
