ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి బలోద్లోని కాంకేర్ జాతీయ రహదారిపై జగత్రాలో వేగంగా వస్తున్న ట్రక్కు బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బొలెరో నుజ్జునుజ్జయింది. ప్రమాదం నుంచి ఓ బాలిక సురక్షితంగా బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారిని రాయ్పూర్ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు, నలుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
మృతులంతా ధామ్తరి జిల్లా సోరెం భట్గావ్ గ్రామంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన వారని ఎస్పీ జితేంద్ర కుమార్ వెల్లడించారు. వీరంతా బంధువుల పెళ్లి కోసం క్యాంకర్స్కు వెళ్తున్నారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ కోసం వెతుకుతున్నామని ఎస్పీ జితేంద్ర తెలిపారు.
ప్రమాదంపై సీఎం భూపేష్ బాగెల్ ట్విట్టర్లో విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
బలోద్ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్ సంతాపం వ్యక్తం చేశారు pic.twitter.com/yNFrGMXlOg
— ANI MP/CG/రాజస్థాన్ (@ANI_MP_CG_RJ) మే 3, 2023
The post పెళ్లి కారును ఢీకొన్న లారీ… ఒకే కుటుంబంలో 11 మంది మృతి appeared first on T News Telugu.
