
మనమందరం టెక్నాలజీ యుగంలో జీవిస్తున్నామని… ఇన్నోవేషన్, టెక్నాలజీ వల్ల ప్రపంచం మొత్తం చాలా ఆసక్తికరంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడమే ఈ ఫ్రేమ్‌వర్క్ ముఖ్య ఉద్దేశమన్నారు. టెక్నాలజీ ప్రజలకు మరింత చేరువ చేసిందని… వస్తున్న ప్రతి కొత్త టెక్నాలజీని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నారు.
కొత్త ఆవిష్కరణలను ప్రభుత్వం ప్రోత్సహించాలని… ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రతి కొత్త టెక్నాలజీకి తగ్గట్టు ప్రభుత్వం కావాలి.
ఫ్రేమ్‌వర్క్ ప్రారంభంతో తెలంగాణలో మంచి రోబో ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. దీంతో భారీ పెట్టుబడులు వస్తాయని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో రోబోటిక్స్ కు సంబంధించిన పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందుకోసం పలు రోబోటిక్ పార్కులు, తయారీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
