
మణిపూర్లో శాంతి భద్రతల మధ్య తెలంగాణ వాసులను సురక్షితంగా హైదరాబాద్కు తరలించేందుకు కృషి చేసిన పోలీసులను డీజీపీ అంజనీకుమార్ ఈరోజు అభినందించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్లోని కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, అభిలాష్ బిస్త్, డీఐజీ బి. సుమతితోపాటు జయరామ్, నగేశ్బాబు, తిరుపతి, సుదర్శన్ తదితర అధికారులను డీజీపీ సన్మానించారు.
ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ మణిపూర్ నుంచి తెలంగాణ వాసులను తరలించడం వంటి అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు అత్యుత్తమ సేవలందించారని కొనియాడారు. మణిపూర్ పర్వత ప్రాంతం అయినప్పటికీ సరైన కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోయినా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ అక్కడి పోలీసు, మిలటరీ అధికారులను సంప్రదించి తెలంగాణ ప్రజలతో మాట్లాడి ఇక్కడికి తీసుకురావడం అభినందనీయమన్నారు.
ఇలాంటి ప్రతి సంక్షోభం కొత్త గుణపాఠమని ఆయన అన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఇతర శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి 112 మందిని సురక్షితంగా తీసుకొచ్చామని అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీ శివధర్ రెడ్డి, అభిలాష బిస్త్, ఐజీ ఎస్ షానవాజ్ కాసిం, ఎం. రమేష్, డీఐజీ బి.సుమతి తదితరులు పాల్గొన్నారు.
