హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మెట్రో రైలు భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రగతిని వివరించారు. మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని నగరంలోని పలు ప్రాంతాలను కలుపుతూ 70 కిలోమీటర్ల మేర రెండో దశలో మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు తెలిపారు.
హైదరాబాద్ మెట్రో కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్‌నుమా నుంచి చాంద్రయాణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లు కొత్తగా మెట్రో లైన్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్ మెట్రో కారిడార్-4లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 29 కిలోమీటర్లు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా హైకోర్టు వరకు నాలుగు కిలోమీటర్లు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.
కారియర్-5లో భాగంగా రాయదుర్గం మెట్రో నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్లు.. రాయదుర్గం నుంచి నానక్‌రామ్‌గూడ, విప్రో జంక్షన్ మీదుగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు రెడీ అయినట్లు చెప్పారు. కారిడార్-6లో మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 14 కిలోమీటర్లు.. మియాపూర్, బీహెచ్‌ఈఎల్ నుంచి పటాన్‌చెరు వరకు విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కారిడార్-7లో ఎల్‌బీనగర్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్‌నగర్ వరకు 8 కిలోమీటర్ల వరకు రెండో దశలో విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు.
Also Read.. రాష్ట్ర ప్రభుత్వం పై పోచారం హాట్ కామెంట్స్
