మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించింది. బీఆర్ఎస్ ఇంకో ఏడో, ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేది. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయాం. పోయినసారి మల్కాజ్ గిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయాం. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే మల్కాజ్ గిరిలో ఈ సారి విజయం మనదే. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్.. గత నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి పిలుపునిచ్చారు. వారి మాటలనే నేను గుర్తు చేశాను. నేను బిల్లులు కట్టొద్దంటే.. భట్టి నాది విద్వంసకర మనస్తత్వం అని అంటున్నారు. నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా? సోనియానే బిల్లులు కడుతుందని వాళ్ళు చెప్పారు.. అందుకే కరెంటు బిల్లులు సోనియాకే పంపుదాం. సోనియాకు ప్రజలు బిల్లులు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలి. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. మనం ఇప్పట్నుంచే ఒత్తిడి చేయాలి.
నిరుద్యోగ భృతిపై భట్టి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ తప్పించుకున్నట్టే.. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదాపై మాట మార్చింది. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్ధంగా వాడుకోవాలి. మనం పాలన మీదే దృష్టి పెట్టి.. యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్ట లేకపోయాం. ప్రగతి భవన్లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారు. విలాసాలే అందులో ఉంటే.. భట్టి ఈ పాటికే టాంటాం చేయక పోయేవారా? ఆన్లైన్లో రేషన్ కార్డులు ఇచ్చాం.. ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదు. పార్టీ కమిటీలు కూడా పూర్తిగా వేయక పోవడం వల్ల నష్టం జరిగింది.. ఇక ముందు అలా జరగదు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందాం. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవు. కార్ కేవలం సర్వీసింగ్‌కు వెళ్ళింది.. మళ్ళీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుంది. కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు.. కార్యకర్తలు అధైర్య పడొద్దు. పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుంది. మోడీకి, రేవంత్ రెడ్డికి భయ పడే పార్టీ బీఆర్ఎస్ కాదు. ఎట్టి పనికైనా.. మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్. పార్లమెంటులో తెలంగాణ సమస్యల మీద పోరాడిన చరిత్ర బీఆర్ఎస్దే. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ గెలవాలి.
Read Also: ఈ శుక్రవారం నుంచి ఓటీటీలోకి ‘యానిమల్’
కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యలు చూసినా, ఈ రోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు చూసినా అదే విషయం రుజువు అవుతుంది. ఇటీవల మోడీని రేవంత్, భట్టి కలిసినపుడు ఆయన బీఆర్ఎస్ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తాను అన్నారట.. ఇది రాధాకృష్ణ చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ టీం కాదు. బీజేపీ-కాంగ్రెస్‌లు ఒక్కటేనని స్పష్టంగా తెలియడం లేదా? అదానీ-మోడీ ఒక్కటేనని ఢిల్లీలో విమర్శించే కాంగ్రెస్.. దావోస్‌లో అదే అదానీతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. అదానీకి మనం అవకాశమే ఇవ్వలేదు. మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాలి. మల్కాజ్ గిరిలో భారీ మెజారిటీ దిశగా కష్ట పడదాం’ అని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
The post మోడీకి, రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదు appeared first on tnewstelugu.com.
