రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని పెయింట్‌ల తయారీ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం సాయంత్రం షాద్‌నగర్ సమీపంలోని శ్రీనాథ్ రోటో ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ పెయింట్ విభాగంలో పెయింట్ తయారీ యంత్రంలో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న 14 మంది సిబ్బంది మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 11 మంది శరీరాల్లో 50% పైగా కాలిన గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 50 మందికి పైగా కార్మికులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
