మనసుకు నచ్చినవాడిని ప్రేమ వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువును..రహదారిపై గుంత బలి తీసుకుంది. ఈ విదారక సంఘటన విశాఖ నగర పరిధిలోని పినగాడి-వేపగుంట రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. పెందుర్తి ట్రాఫిక్ ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..గోపాలపట్నం దరి ఆర్ఆర్ వెంకటాపురానికి చెందిన పెంటకోట వెంకటఅప్పారావు, సుబ్బవరం మండలం గుల్లేపల్లికి చెందిన సంతోషి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం అక్టోబర్ లో వీరి పెళ్లి జరిగింది. దంపతులు ఇద్దరూ గురువారం సాయంత్రం బైక్ పై గుల్లేపల్లికి వెళ్లారు.
ఇది కూడా చదవండి: చంద్రయాన్ 3 నుంచి సంకేతాలు..లొకేషన్లు గుర్తిస్తుందన్న ఇస్రో..!!
రాత్రి 10 గంటల సమయంలో పినగాడి మీదుగా తిరిగి వస్తుండగా చీమలాపల్లి దరి మీనాక్షి కల్యాణ మండపం సమీపంలో బైక్ అదుపు తప్పి గుంతలో పడింది. వెనక కూర్చున్న సంతోషి కిందపడింది. ఆమెకు తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. స్థానికుల సహాకారంతో 108లో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోషి మరణించింది. ప్రేమ వివాహం చేసుకుని ఏడాది కూడా గడవక ముందు రహదారి గుంత రూపంలో సంతోషి ప్రాణాలను కోల్పోవడం కుటుంబంలో విషాదం నెలకొంది.
