కులాలు వేరైనా వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోరని భావించి స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. మాయమాటలు చెప్పి బిడ్డను ఇంటికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.
Read Also: మహిళల ఫ్రీ బస్ జర్నీపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్
తంజావూరుకు చెందిన ఐశ్వర్య (19) నవీన్ (19) స్కూల్ రోజుల నుంచి స్నేహితులు. వారి స్నేహం వారితో పాటే పెరిగి ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూర డిసెంబర్ 31న స్నేహితుల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దాంతో కూతురు కనిపించడం లేదని ఐశ్వర్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి, ఐశ్వర్య ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో కూతురు, అల్లుడితో మాట్లాడిన తల్లిదండ్రులు.. కూతురును కొన్ని రోజులు ఇంటికి పంపాలని కోరారు. వారి కోరిక మేరకు ఐశ్వర్య.. పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత రెండు రోజులకు నవీన్ ఐశ్వర్యకు కాల్ చేయగా ఫోన్ ఆఫ్ వచ్చింది. రెండు రోజులు గడిచిపోయినా వారు తన భార్యను పంపకపోవడంతో నవీన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఐశ్వర్య ఇంటికి వెళ్లి విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన కూతురు వేరే కులస్తుడైనా నవీన్ని పెళ్లి చేసుకుందనే కోపంతో పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐశ్వర్య తల్లిదండ్రులైన పెరుమాళ్లు, రోజాలను అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.
