Cyber Crime | బంజారాహిల్స్, ఫిబ్రవరి 21: గూగుల్ టాస్క్‌లు పూర్తిచేస్తే.. లక్షల్లో డబ్బు సంపాదించవచ్చంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నరేశ్‌కు ఈ నెల 15న గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా పరిచయమయ్యారు. టెలిగ్రామ్‌లో కొన్ని టాస్క్‌లు పూర్తిచేస్తే.. డబ్బులు సంపాదించవచ్చని నరేశ్‌ను నమ్మించారు. అలెగ్జాండ్రా పేరుతో టెలిగ్రామ్‌లో చాటింగ్ చేస్తూ.. కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. ప్రారంభంలో కొన్ని డబ్బులు డిపాజిట్ చేయడం, టాస్కులు పూర్తిచేసిన వెంటనే కొంత డబ్బు తిరిగి ఇవ్వడంతో..
బాధితుడు ఎక్కువ మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయడం ప్రారంభించాడు. మూడు రోజుల్లో సుమారు రూ.81 వేలు డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత దుండగులు మరో మూడున్నర లక్షలు పంపించాలని, లేకుంటే ఇప్పటి వరకు పంపిన డబ్బులు మొత్తం పోతాయంటూ బెదిరించారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన నరేశ్ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.