Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో బీమా దారుల క్లయిమ్ నిబంధనలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) సవరించింది.
Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో బీమా దారుల క్లయిమ్ నిబంధనలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) సవరించింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్, మారటోరియం గడువును తగ్గించివేసింది. తత్ఫలితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వారికి మరింత లబ్ధి చేకూరనున్నది. సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేస్తున్నప్పుడు సంబంధిత పాలసీదారు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీ ప్రారంభానికి కొంత కాలం వెయిటింగ్ పీరియడ్ ఉంటది. ఆ గడువు లోపు పాలసీదారు అనారోగ్యానికి గురైతే.. ఎటువంటి బీమా కవరేజీ లభించదు. దీన్నే పీఈడీ వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఈ వెయిటింగ్ పీరియడ్ ను నాలుగేండ్ల నుంచి మూడేండ్లకు తగ్గించింది. అయితే, విదేశీ ప్రయాణ బీమా పాలసీలకు ఈ రూల్ వర్తించదు.
అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై మారటోరియం గడువును ఎనిమిదేండ్ల నుంచి ఐదేండ్లకు తగ్గిస్తూ ఐఆర్డీఏఐ నిర్ణయం తీసుకున్నది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తొలిసారి కొనుగోలు చేసిన వారు వరుసగా ఐదేండ్లు ప్రీమియం చెల్లిస్తే.. పాలసీ ఒప్పందం ప్రకారం అన్ని రకాల క్లయిమ్‌లూ సదరు ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించాల్సిందే.
ఇక హెల్త్ పాలసీ ప్రారంభమైన తర్వాత నాలుగేండ్ల వరకూ కొన్ని వ్యాధులకు చికిత్సపై ఏ కవరేజీ ఉండదు. దీన్నే నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్ అని అంటారు. అయితే, ప్రమాదాలు జరిగితే మినహాయింపు ఉంటది. గడువు ముగిసిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో పేర్కొన్న అన్ని రకాల చికిత్సలకు ఇన్సూరెన్స్ కవరేజీ అందుకోవచ్చు. తాజాగా నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్‌ను మూడేండ్లకు కుదించేస్తూ ఐఆర్డీఏఐ నిర్ణయం తీసుకున్నది. ఆరోగ్య బీమా పాలసీ కవరేజీ విషయంలో ఐఆర్డీఏఐ తీసుకొచ్చిన మూడు సవరణలు కొత్త, పాత పాలసీలకు వర్తిస్తాయని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు.